భూకంపం దాటికి టర్కీ, సిరియాలో 21 వేలు దాటిన మృతుల సంఖ్య

సోమవారం టర్కీ, సిరియాలో దేశాల్లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. వేలాది భవనాలు నేలమట్టం కాగా, అందులో వేలాదిమంది చిక్కుకొని ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భవనాల కింద కుప్పలకుప్పలుగా మృత దేహాలు కనిపించడం అందర్నీ కన్నీరు మున్నీరు చేస్తున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 21 వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. టర్కీలో 17,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 4,000 మంది మృతి చెందారు.

ఇక భూకంపం సంభవించినప్పటి నుంచి వేలాది మంది ప్రజలు తాత్కాలిక శిబిరాలు, స్టేడియాల్లో ఆశ్రయం పొందుతున్నారు. సహాయక చర్యల్లో 1,10,000 మందికి పైగా పాల్గొంటున్నారు. దాదాపు 5 వేల ట్రాక్టర్లు, బుల్డోజర్లు, క్రేన్లు రంగంలోకి దిగాయి. భూకంపంతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు పలు దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. టర్కీలోని హతాయ్‌ ప్రావిన్సులో భారత సైన్యం తాత్కాలిక ఆసుపత్రిని నెలకొల్పి అత్యవసర వైద్య సేవలను అందజేస్తోంది. గత 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన భూకంపాలలో 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చివరిసారిగా టర్కీలో పెను భూకంపం 1939లో సంభవించింది. ఇప్పుడు అదే స్థాయిలో భూకంపం చోటుచేసుకుంది.