ట్రంప్‌ను చుట్టుముడుతున్న మరిన్ని చిక్కులు

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ రాసిన ఓ పుస్తకం అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఇప్పటికే అభిశంసన తీర్మానంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై గురిపెట్టిన ప్రత్యర్థులకు సరికొత్త అస్త్రమైంది. చుట్టుముట్టిన సవాళ్ల నుంచి బయటపడేందుకు ట్రంప్‌ వర్గం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అభిశంసన వ్యవహారంలో ట్రంప్‌ను మరిన్ని చిక్కులు చుట్టుముడుతున్నాయి. అధికార దుర్వినియోగానికి సంబంధించిన మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. డెమోక్రాటిక్‌ పార్టీ నేత, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌, ఆయన కుమారున్ని ఇరకాటంలో పడేసేందుకు ఉక్రెయిన్‌ సహకరించే వరకు ఆ దేశానికి ఆర్థిక సాయం నిలిపివేయాలని జాన్‌ బోల్టన్‌తో ట్రంప్‌ అన్నట్టు తెలిసింది. బోల్టన్‌ స్వయంగా రాసిన ఓ పుస్తకంలో ఈ విషయం ఉన్నట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక కథనం ప్రచురించింది. ఉక్రెయిన్‌లోని ఓ గ్యాస్‌ కంపెనీతో బిడెన్‌ కుటుంబానికి సంబంధం ఉంది. ఆ సంస్థకు చెందిన వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించేలా ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై ట్రంప్‌ ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన ఆరోపణ. అధికార దుర్వినియోగం ఆరోపణలతో ట్రంప్‌ను అభిశంసించడంపై అమెరికా ఎగువ సభలో విచారణ జరుగుతోంది. మంగళవారం నుంచి ట్రంప్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/