నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ టెస్ట్‌లు

కరోనా తీవ్రత పూర్తి స్థాయిలో ఇంకా తగ్గకముందే మరోమహమ్మారీ దేశంలోకి ప్రవేశించింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి కేసు కేరళలో వెలుగు చూసింది. వైరస్ సోకిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టింది అక్కడి వైద్యశాఖ. ఈ క్రమంలో మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ తరుణంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ టెస్టులు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మంకీపాక్స్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా వైద్య శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. భారీ సంఖ్యలో పరీక్షల నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే పూణె వైరాలజీ ల్యాబ్ నుంచి టెస్టింగ్ కిట్లను తెప్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. కిట్లు అందుబాటులోకి రాగానే ట్రయల్ రన్స్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టుల మాదిరిగానే మంకీపాక్స్ టెస్టులు చేయనున్నారు. బ్లడ్, స్వాబ్, స్కిన్‌పై ఉన్న నీటిబుడగల నుంచి శాంపిల్స్ సేకరించనున్నారు.
ఇక కేంద్రం సైతం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు.. జ్వరం, జబ్బులున్న వాళ్లతో సన్నిహితంగా ఉండొద్దని పేర్కొంది. అలాగే.. ఎలుకలు, ఉడుతలు, వన్యప్రాణులు, ఇతర జీవులకు దూరంగా ఉండాలని, అడవి జంతువుల మాంసం విషయంలో, ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తా ఉండాలని సూచించింది. ఆఫ్రికా నుంచి దిగుమతి అయిన వణ్యప్రాణి సంబంధిత ప్రొడక్టులు.. లోషన్లు, క్రీమ్‌లు, పౌడర్లకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇన్‌ఫెక్షన్ సోకిన వాళ్లు వాడినవి, ఇన్‌ఫెక్షన్ సోకిన జంతువులకు దూరంగా ఉండడం తప్పనిసరి. జ్వరం, దద్దర్లు లాంటి మంకీపాక్స్ సంబంధిత లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్య సిబ్బందిని సంపద్రించాలని పేర్కొంది.