ఆచార్యను కలిసిన సన్నాఫ్ ఇండియా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు చిరంజీవి రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ స్పాట్‌కు ఓ అనుకోని అతిథి వచ్చి అందరికీ షాకిచ్చాడు.

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా చిరంజీవి ఆచార్య సెట్‌కు వెళ్లారు. అక్కడ చిరంజీవిని మర్యాదపూర్వంగా కలిసిన మోహన్ బాబు, చిరుతో చాలా సేపు సమయం గడిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో చిరు, మోహన్ బాబుల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తామిద్దరం మంచి స్నేహితులం అని పలుమార్లు మీడియా ముందు చెబుతూ వచ్చిన చిరంజీవి, మోహన్ బాబులు ఇలా ఒకేచోట కలవడం తమకు సంతోషానిచ్చిందని అభిమానులు అంటున్నారు.

ఇక మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మంచు విష్ణు ప్రొడ్యూస్ చేస్తుండగా డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. కాగా ఆచార్య చిత్రంలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.