మహమ్మద్​ సిరాజ్​కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా

టీమిండియా క్రికెటర్​ మహమ్మద్​ సిరాజ్​ కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. టీమ్ఇండియా సుదీర్ఘ విరామం త‌రువాత టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. దాదాపు 17 ఏళ్ల త‌రువాత పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను మ‌రోసారి భార‌త్ అందుకుంది. భార‌త జ‌ట్టు విశ్వ విజేత‌గా నిల‌వ‌డంతో దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల‌తో పాటు ఆట‌గాళ్లు సంబ‌రాలు చేసుకున్నారు. ఇక భార‌త జ‌ట్టు విజ‌యం సాధించ‌డంలో తెలుగు ఆట‌గాడు మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ త‌న వంతు పాత్ర పోషించాడు. ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌రువాత హైద‌రాబాద్‌కు చేరుకున్న సిరాజ్‌కు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

ఈ క్రమంలో ఈరోజు సిరాజ్..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం రేవంత్ అభినందించారు. ఆ తర్వాత సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎం రేవంత్ రెడ్డికి బహుకరించాడు. కాగా, ఈ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సిరాజ్‌ మియాకు హైదరాబాద్‌లో ఇంటిస్థలంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈమేరకు స్థలం చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.