ముఖ్యమంత్రి జగన్ కు బర్త్ డే విషెష్ తెలిపిన మోదీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు , కార్య కర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. అలాగే ఇతర పార్టీ నేతలు సైతం జగన్ కు బర్త్ డే విషెష్ అందజేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ సీఎం జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

ఇక జగన్ విషయానికి వస్తే..తన తండ్రి వైఎస్ మరణం తర్వాత సొంతగా పార్టీ పెట్టి.. కేసులను ఎదుర్కొని.. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ చరిత్రలో ఎవరూ సాధించలేని అద్భుతమైన ఘన విజయాన్ని అందుకున్నారు. ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది ఓ ప్రభంజనం సృష్టించారు. ఓ ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగన్.. తనకు ఎదురైన అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కడిగా ప్రారంభమై ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న జగన్‌ పొలిటికల్ జర్నీ ఎంతోమందికి ఆదర్శమనే చెప్పాలి.

ఇక రాష్ట్రంలో రైతు భరోసా, అమ్మఒడి, వసతి దీవెన, కంటి వెలుగు ఇలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల్లో 50శాతం మహిళలకు.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాలనలో దాదాపు మూడేళ్లు పూర్తి చేసుకున్నారు.. సరికొత్తగా మరికొన్ని పథకాలను కూడా తీసుకొచ్చారు. ఇలా జగన్ ఒక్కడిగా మొదలై.. ఎన్నో కష్టాలను దాటుకొని మందుకు సాగుతున్నారు.

ఈరోజు (డిసెంబర్ 21) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి హోదా లో ఆయన తొలిసారి తణుకు రానుండటంతో అధి కార యంత్రాంగం, పార్టీ నాయకులు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులకు గృహహక్కు పత్రాల పంపిణీని సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మందికి పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.