గుజరాత్ ప్రజలకు కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోడీ

గుజరాత్ లో మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. వరుసగా ఏడోసారి బిజెపికి ప్రజలు పట్టంకట్టడం తో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘నా సొంత రాష్ట్రం గుజరాత్ కు ధన్యవాదాలు. ఈ భారీ విజయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యాను’’ అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారు. రానున్న రోజుల్లోనూ ఇదే ఊపు కొనసాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. గుజరాత్ జనశక్తికి నా వినమ్ర పూర్వక నమస్సుమాంజలి’’ అని ట్వీట్ లో ప్రధాని తెలిపారు.

ఈ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ‘‘హిమాచల్ ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషిచేస్తాం. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజల సమస్యలను లేవనెత్తి మాట్లాడుతాం’’ అని మోడీ పేర్కొన్నారు.

మరోపక్క గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ రఘు శర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. “రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనూహ్య ఓటమికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నాను. పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నా రాజీనామాను దయచేసి ఆమోదించండి” అని లేఖలో పేర్కొన్నారు.