రాష్ట్రాలు ఒక్కసారి పరిశీలించండి..ప్రధాని

1 నుంచి 2 రోజుల లాక్ డౌన్ తో ప్రయోజనం

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి నిన్న కరోనా కేసులు అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. స్వల్ప కాల వ్యవధుల్లో మరోమారు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించే అంశాన్ని అన్ని రాష్ట్రాలూ పరిశీలించాలని సూచించారు. దేశంలో రోజుకు దాదాపు లక్ష వరకూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్న వేళ, కరోనా ఎవరిలో ఉందన్న విషయాన్ని ట్రేస్ చేయాలంటే, మరోమారు లాక్ డౌన్ ను విధిస్తే బాగుంటుందని, ఈ విషయమై రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని మోడి సూచించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో తరచుగా 1 నుంచి 2 రోజుల లాక్ డౌన్ ను రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేస్తే, వైరస్ ఎవరిలో ఉందన్న విషయం బయటకు వచ్చేస్తుందని, దాని ద్వారా వైరస్ ను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

‘లాక్ డౌన్ తో మేలే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది నిరూపితం. లాక్ డౌన్ మంచి నిర్ణయమని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, ఇప్పుడిక మైక్రో కంటైన్ మెంట్ జోన్లపై మరింత దృష్టిని సారించాలి. అక్కడి నుంచే వైరస్ వ్యాపిస్తోంది. ఒకటి నుంచి రెండు రోజుల లాక్ డౌన్ పై రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే, ఆర్థిక వ్యవస్థ కూడా పెద్దగా ప్రభావితం కాబోదు. అన్ని రాష్ట్రాలకూ నా సలహా ఇదే. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిశీలించాలి. టెస్టింగ్, ట్రీటింగ్, నిఘా పెట్టడం తదితర విషయాలపై మన దృష్టిని పెట్టాలి’ అని నరేంద్ర మోడి వ్యాఖ్యానించారు.

మోడి సమావేశానికి మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశంలోని మొత్తం కేసుల్లో 63 శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 77 శాతం మరణాలు కూడా ఈ రాష్ట్రాల్లోనే సంభవించాయి. ఈ రాష్ట్రాలన్నీ ఆక్సిజన్ నిల్వలను పెంచుకోవాలని, రోగులకు ఆక్సిజన్ కొరతను రానివ్వకుండా చూసుకోవాలని కూడా ప్రధాని సూచించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/