సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన మోడీ

సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం వైజాగ్ కు చేరుకున్న ఆయన..ఈరోజు వైజాగ్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. మధ్యాహ్నం బేగం పేట కు చేరుకొని అక్కడి సభలో పాల్గొన్నారు. అనంతరం రామగుండంకు చేరుకున్నారు.

రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. ఆర్ఎఫ్ సీఎల్ లో ఎరువుల ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెబుతున్నారని, సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆ అధికారం కేంద్రానికి లేదని చెప్పారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా..కేంద్రానికి 49 శాతం వాటా ఉందన్నారు. సింగరేణి బొగ్గు గనులపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పుకార్లను నమ్మవద్దని మోడీ సూచించారు. సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని కొందరు హైదరాబాద్ నుంచి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో గతంలో అనేక స్కాంలు జరిగాయని ఆరోపించారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం వల్ల రైతులకు ఎరువుల కొరత తీరిందని ప్రధాని మోడీ అన్నారు. గతంలో ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లమని చెప్పారు. కానీ ప్రస్తుతం దేశంలో గోరఖ్ పూర్ , రామగుండంతో పాటు..మరో 5 ప్రాంతాల్లో ఎరువుల ఉత్పత్తి జరుగుతోందన్నారు. దీని వల్ల భారతే ప్రపంచ దేశాలకు ఎరువులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.