‘హిందీ-రూసో

వార్తల్లోని వ్యక్తి
(ప్రతి సోమవారం)

‘హిందీ-రూసో 

MODI , PUTIN
MODI , PUTIN

ఒకప్పుడు రష్యా సోవియెట్‌గా వ్ఞన్నప్పుడు- ఇండియా, రష్యాల మధ్య ప్రగాఢ మైత్రి వ్ఞండేది. సోవియెట్‌ రష్యాలో రూపొందించిన ‘ విజ్ఞాన సర్వస్వంలో మొదట మహాత్మాగాంధీని ‘బనియాగా కించపరచినా, ఆ తరువాత ఇండియాకు స్వాతంత్య్రం సిద్ధించి, ప్రధాని నెహ్రూ ‘అలీన విధానాన్ని అవలంభించిన తరువాత సోవియెట్‌ రష్యా భారత్‌కు ఆప్తమిత్ర రాజ్యాంగా వ్యవహరించింది. అహంకారి అమెరికా అడుగడుగునా ఇండియాపై దెబ్బతీయాలని ప్రయత్నించినప్పుడు సోవియెట్‌ రష్యా అడ్డుకునేది. ముఖ్యంగా కాశ్మీర్‌ సమస్యపై భద్రతా సంఘంలో అమెరికా ఇండియాకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించినప్పుడు దాన్ని సోవియెట్‌ రష్యా ‘వీటో (రద్దు) చేసేది. అలా అమెరికా తీర్మానాలను చాలా సార్లు రద్దు చేసింది. పాక్‌కు రష్యా కబడ్దార్‌ అంతవరకు ఎందుకు? 1962లో చైనా ఇండియాపై దురాక్రమణ యుద్ధం చేసినప్పుడు పాకిస్థాన్‌ కూడా మరోవైపు నుంచి ఇండియాపై దాడి చేయాలని ప్రయత్నించినప్పుడు సోవియెట్‌ రష్యా పాక్‌ను ‘కబడ్దార్‌ అని హెచ్చరించే సరికి అది వెనక్కి తగ్గింది!

అంతేకాక భారతదేశానికి సోవియెట్‌ రష్యా ‘మిగ్‌ విమానాలను, ఇతర ఆయుధ సంపత్తిని సప్లయి చేసేది. అయితే, సోవియెట్‌ (కమ్యూనిస్టు) రష్యాలో కమ్యూనిస్టు వ్యతిరేక వ్యవస్థ ఏర్పడిన తరువాత ఇండో-రూసో సంబంధాలలో జోరు తగ్గింది. అయినా ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలలో మాత్రం మార్పులేదు. మొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత దేశ సందర్శనకు వచ్చినప్పుడు చాలా కాలంగా చర్చల దశలోనే వ్ఞంటూ వచ్చిన ‘ఎస్‌-400 మిసైల్స్‌ ఒప్పందం కొలిక్కి వచ్చి, దానిపై ఉభయ దేశాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ ఆయుధాలు అద్భుతమైనవి.

అవి ఎంత సుదూర లక్ష్యాన్ని అయినా ఛేదించగల ‘బ్రహ్మస్త్రం వంటివి. అయితే, వాటిని ఇండియా రష్యా నుంచి సాధించడం అమెరికాకు కన్నెర్ర! ఒక ప్రక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికలో పుతిన్‌ సహకారమున్నదన్న నినాదం ఇప్పటికీ అమెరికాలో రిపబ్లికన్‌ (ట్రంప్‌), డెమొక్రాటిక్‌ పార్టీల (ప్రతిపక్షం) మధ్య నడుస్తున్నది. మధ్య అమెరికా, రష్యాపై ‘ఆంక్షల విధింపు నాటకం ప్రారం భించింది. ఇది బహుశా ప్రతిపక్షం విమర్శలకు తట్టుకోడానికి ‘కళ్లనీళ్ల తుడుపు కార్యక్రమం కావచ్చు. అనాదిగా సోవియెట్‌ రష్యాకు, అమెరికాకు ‘పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.

అయితే, అది రష్యాలో కమ్యూనిస్టు వ్యవస్థ వ్ఞన్నప్పుడే. పుతిన్‌ వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పువచ్చింది. ఇండియాపై ఆంక్షలు? కాగా, అసూయాగ్రస్తమైన ట్రంప్‌ ప్రభుత్వం ఇండియాపై కూడా ఆర్థిక ఆంక్షలు విధించవచ్చునని మొన్న భారత సాయుధ బలాల అధిపతి జనరల్‌ రావత్‌ భావిస్తూ ఇండియా దేనికీ భయపడదని, ఏ దేశంలోనైనా మరో దేశంతో ఆ దేశ సంబంధాలతో నిమిత్తం లేకుండా తనకు తాను స్వతంత్ర వైఖరినే అవలంబిస్తుందని వాక్రుచ్చారు. కాగా, ఇది ప్రధాని నెహ్రూ నిర్దేశించిన ‘అలీన విధానానికి రూపాంతరమే! తిరుగులేని నాయకుడు పుతిన్‌ రష్యాకు వ్లాదిమిర్‌ పుతిన్‌ తిరుగులేని నాయకుడు. ఆయన నియంతకాకపోయినా, చిరకాలంగా రష్యా అధినేత. ఆయన 2000 నుంచి 2008 వరకు దేశ అధ్యక్షుడుగాను, అంతకు పూర్వం 1999-2000 మధ్య తిరిగి 2008- 2012 మధ్య ప్రధానిగాను వ్ఞన్నారు. పుతిన్‌ 1952 అక్టోబర్‌ 7వ తేదీన రష్యాలోని లెనిన్‌ గ్రాడ్‌లో జన్మించారు. ఆయనకు ఇంగ్లీషు, జర్మన్‌ భాషలు బాగా తెలుసు. మంచి క్రీడాకారుడు, ముఖ్యంగా మల్లయుద్ధ ప్రవీణుడు. ‘జూడో క్రీడలో ఆయన బ్లాక్‌ బెల్ట్‌ కూడా సాధించాడు. బాహుబలి ఈ ‘బాహుబలి సోవియెట్‌ రష్యాలోని గూఢాచారి సంస్థ కె.బి.జి.కి చీఫ్‌గా పనిచేశారు.

సోవియెట్‌ వ్యవస్థ అంతరించిన తరువాత పుతిన్‌ను కొత్త ప్రభుత్వం ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ అధిపతిగా నియమించింది.! గూఢాచర్యలో సిద్ధహస్తుడైన పుతిన్‌ పరస్పర వ్యతిరేకమైన రెండు ప్రభుత్వాలకు విశ్వాసపాత్రుడు కావడం విశేషం. రష్యన్‌ ప్రజలకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఈ గూఢచర్య నాయకుని వయస్సు 66 సంవత్సరాలు. ఆయన కృశ్చెన్‌, కొసిగిన్‌ ప్రభృతుల వలె భారత మిత్రుడు.

– డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు (”పద్మశ్రీ అవార్డు గ్రహీత)