అమిత్‌షాపై ప్రధాని మోడి ప్రశంసలు

అమిత్ షాకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపిన మోడి

Modi - Amit Shah
Modi – Amit Shah

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రధాని మోడి ప్రశంసల జల్లు కురిపించారు. అమిత్ షా గొప్ప కార్యదక్షకుడు, అత్యంత అనుభవశాలి అని కితాబిచ్చారు. మన దేశ రక్షణ, సాధికారత విషయాల్లో అమిత్ షా భాగస్వామ్యం మహోన్నతమైనదని అన్నారు. నేడు అమిత్ షా పుట్టినరోజు. ఈరోజుతో ఆయన 55వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షాకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపిన మోడి… ఆయనపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

‘నా కేబినెట్ సహచరుడు అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు. కష్టపడే మనస్తత్వం, అనుభవం, కార్యదక్షత కలబోసిన గొప్ప వ్యక్తి అమిత్ షా. భారత ప్రభుత్వంలో కీలక పాత్రను పోషిస్తూనే… దేశ రక్షణ, సాధికారత అంశాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన నిండు జీవితాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ హిందీలో మోడి ట్వీట్ చేశారు.

1964 అక్టోబర్ 22న అమిత్ షా జన్మించారు. 2014 నుంచి బీజేపీని జాతీయ స్థాయిలో ఆయన నడిపిస్తున్నారు. ఆయన సారథ్యంలో 10 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజీకీయ పార్టీగా బీజేపీ అవతరించింది. క్రికెట్ ను ఎంతో అభిమానించే అమిత్ షాకు… హిస్టరీ, లిటరేచర్ అంటే అమితాసక్తి ఉంది. అమిత్ షా జన్మదినం సందర్భంగా పార్టీలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/