ద్వైపాక్షిక అంశాలపైనా చర్చ

Modi, Trump
Modi, Trump

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. కొందరు ప్రాంతీయ స్థాయి నేతలు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రేలాపనలకు దిగుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలను పరోక్షంగా ప్రస్తావించారు. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న తరువాత ట్రంప్‌తో మోడీ ఫోన్ సంభాషణ ప్రాధాన్యతను సంతరించుకుంది.

కొందరు ప్రాంతీయ నేతలు భారతదేశంపై దాడులు జరగాలనే రీతిలో హింసాత్మక వ్యాఖ్యలకు దిగుతున్నారని ప్రధాని మోడీ ట్రంప్‌తో చెప్పారు. శాంతియుత వాతావరణానికి ఇటువంటి వైఖరి సరైనది కాదని తెలిపారు. అమెరికా అధ్యక్షులతో ప్రధాని మోడీ అరగంట సేపు ఫోన్ సంభాషణ జరిపారని, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలను ప్రస్తావించారని ఆ తరువాత ప్రధాన మంత్రి కార్యాలయం వారు ఒక ప్రకటన వెలువరించారు. చాలా సృహద్భావ, ఆత్మీయల సూచకంగా సంభాషణ సాగిందని తెలిపారు. ఇరు దేశాల నేతల మధ్య ఉన్న సత్సంబంధాలు ఈ సందర్భంగా స్పష్టం అయ్యాయని వివరించారు. ఈ ప్రాంతంలో కొందరు మాట్లాడుతున్న తీరు శృతి మించుతోందని, ఇది సమస్యలను జటిలం చేసి, శాంతిని దెబ్బతీస్తుందని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద రహితంగా, భయాందోళనలకు తావులేని విధంగా సవ్యమైన వాతావరణం ఉండాలనేదే భారతదేశ అభిమతం అని మోడీ స్పష్టం చేశారు. కాగా పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధుల నిర్మూలనలు వంటి కార్యక్రమాల దిశలో సవ్యమైన రీతిలో పాటుపడే వారితో భారతదేశం ఎల్లవేళలా సహకరిస్తుందని, ఇందుకు కట్టుబడి ఉంటామని ప్రధాని ఈ సందర్భంగా ట్రంప్‌తోచెప్పినట్లు ప్రధాని కార్యాలయం వారు తమ ప్రకటనలో తెలిపారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/