ముగిసిన మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తియ్యాయి. తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం..కుటుంబ సభ్యులంతా తుది వీడ్కోలు పలికారు. మోడీతో పాటు ఆయన సోదరులు హీరాబెన్ చితికి నిప్పంటించారు. గాంధీనగర్‌లో హీరాబెన్ అంత్యక్రియలు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున హీరాబెన్ తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆమె అస్వస్థతకు గురికావడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. తల్లి మరణవార్తను మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని’ పేర్కొన్నారు. ఆమె నిస్వార్థ కర్మయోగి అని, ఆమె జీవితం విలువలతో కూడుకున్నదని పేర్కొన్నారు. వందో పుట్టిన రోజు నాడు తాను తన తల్లిని కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎప్పుడూ తనతో ఓ విషయాన్ని చెప్పేవారని, విజ్ఞతతో పనిచేయాలని, జీవితాన్ని స్వచ్చంగా గడపాలని చెప్పేవారని పేర్కొన్నారు. హీరాబెన్ అంతిమయాత్ర లో తల్లి హీరాబెన్ పాడె మోశారు మోడీ. ఇక మోడీ తల్లి మరణం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్ సంతాపం తెలిపారు.