కృష్ణం రాజు మృతి పట్ల మోడీ , అమిత్ షా సంతాపం

కృష్ణం రాజు మృతి పట్ల ప్రధాని మోడీ , కేంద్ర మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేసారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా వేర్వేరుగా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృష్ణం రాజు సినిమాలపై కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. కృష్ణంరాజు మృతి చెందడం ఎంతో బాధాకరమని.. ఆయన సినిమాలు రాబోయే తరానికి మార్గదర్శనం చేస్తాయన్నారు. కృష్ణం రాజు సినిమాల్లోని మాధుర్యం, సృజనాత్మకతను భవిష్యత్తు తరాలు అందిపుచ్చుంటాయని ట్వీట్ లో పేర్కొన్నారు. సామాజిక సేవలోనూ ముందుండే ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. కృష్ణంరాజుకుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రెబల్ స్టార్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ తెలుగులో ట్వీట్ చేశారు అమిత్ షా. తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణంరాజు బహుముఖ నటనతో, సామాజిక సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చిందని తెలిపారు.

అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి , సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేసారు. ఇక చిత్రసీమ నుండి కూడా కృష్ణం రాజు కలిసి నటించిన నటి నటులు , నేటితరం హీరోలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.