పొంగులేటిఫై తాత మధు కౌంటర్

ఖమ్మం రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కిస్తున్నాయి. పొంగులేటి vs బిఆర్ఎస్ గా మారింది. గత కొద్దీ రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం పేరిట తన అనుచరులను కలుస్తూ..బిఆర్ఎస్ ఫై పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా అశ్వరావుపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మాట్లాడుతూ..వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. మొన్నటి వరకు పార్టీ అన్ని కార్యక్రమాలకు ఆహ్వానించారని, మీ గెలుపు కోసం తనని ప్రాధేయపడ్డారని, కానీ ఇప్పుడు తనకి బిఆర్ఎస్ సభ్యతమే లేదని అంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అధికారం ఎవ్వడి అబ్బ సొమ్ము కాదని.. ప్రజా తీర్పే అంతిమ అని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఎక్కడైనా వస్తుందా? అని ప్రశ్నించారు. రుణమాఫీ కూడా 20 శాతమే చేశారని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడగు వేయను అని స్పష్టం చేశారు. నాడు కురుక్షేత్రంలో కౌరవులంతా ఒక పక్కన ఉన్నారని, కానీ నేడు శీనన్న వెంట లక్షలాది హృదయాల మద్దతు ఉందని, ఆ తుపానులో మీరు కొట్టుకుపోవడం తథ్యం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు హాట్ కామెంట్స్ చేశారు. పొంగులేటి వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు తాత మధు. పొంగులేటికి బీఆర్‌ఎస్ పార్టీ ఏం అన్యాయం చేసిందో బహిరంగ చర్చ కు రావాలని మధు డిమాండ్ చేశారు. పొంగులేటి చేసే రాజకీయాలన్నీ వెన్నుపోటు రాజకీయాలేనని ఆరోపించారు.

పోటుగాడు కేటుగాడుగా మారాడు. దమ్ముంటే నన్ను బహిష్కరించాలని.. కేసీఆర్‌కు, జిల్లా పార్టీకి సవాల్ విసిరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్‌ను విమర్శించేంత పోటు మొనగడా..? గత ఎన్నికల్లో పొంగులేటి అనుచరులకే సగం సీట్లు ఇచ్చింది పార్టీ. మీకు నిజంగా ప్రజాదరణ ఉంటే వాళ్లను ఎందుకు గెలిపించుకొలేదు..? జిల్లాలో పొంగులేటి తన బ్రాండ్ నడవలానుకుంటున్నాడు. బీఆర్‌ఎస్ పార్టీలో ఎవరి బ్రాండ్ నడవదు. ఒక్క కేసీఆర్ బ్రాండ్ మాత్రమే నడుస్తుంది. డబ్బు రాజకీయాలు ఖమ్మం జిల్లాలో పని చేయవు. రైతు బంధు ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఆ మాట అన్న పొంగులేటికి సంబంధించిన 108 ఎకరాలకు రైతుబంధు వస్తుంది. 2014 కన్న ముందు నీ పరిస్థితి ఏంటీ… ఇప్పుడు నీ పరిస్థితేంటీ..?” అంటూ పొంగులేటికి తాతా మధు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మరి మధు కౌంటర్ కు పొంగులేటి రీ కౌంటర్ ఎలా ఇస్తారో చూడాలి.