ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష‌

MLC Kavitha’s protest initiation ended in Delhi

న్యూఢిల్లీః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత మ‌హిళా రిజర్వేష‌న్ బిల్లు కోసం ఢిల్లీలో చేప‌ట్టిన నిరాహార దీక్ష విజ‌య‌వంతం అయింది. సాయంత్రం 4 గంట‌ల‌కు ఎమ్మెల్సీ క‌విత‌కు ఎంపీ కే కేశ‌వ‌రావు నిమ్మ‌ర‌సం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌జేశారు. నిరాహార దీక్ష ముగిసిన తర్వాత కవిత మాట్లాడుతూ..ఉద్యమానికి మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమన్న కవిత.. వచ్చే పార్లమెంట్‌లో సమావేశాల్లో బిల్లు పాసయ్యేలా, అందరం కలిసి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. మహిళల రిజర్వేషన్‌ కోసం ఇది పోరాట సమయమని అభివర్ణించిన కవిత, చిన్నగా మొదలైన ఈ ఉద్యమం..దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు.

మహిళలకు అవకాశం ఇస్తే, అన్నింట్లో రాణిస్తారాన్ని కవిత తెలిపారు. ఇక మహిళా బిల్లుపై తగ్గేది లేదని తేల్చి చెప్పిన కవిత దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ముర్ము మహిళా బిల్లుపై ఈ ఏడాది జరిగే పార్లమెంట్‌ చివరి సెషన్‌లో రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందేలా ఒత్తిడి తేవాలని కవిత డిమాండ్‌ చేశారు. ఈ దీక్ష‌కు మొత్తం 18 పార్టీలు సంఘీభావం ప్ర‌క‌టించాయి.

క‌విత దీక్ష‌లో ఆప్ నేత‌లు సంజ‌య్ సింగ్, చిత్ర స‌ర్వార‌, న‌రేష్ గుజ్రాల్ (అకాలీద‌ళ్‌) శివ‌సేన ప్ర‌తినిధులు, అంజుమ్ జావేద్ మిర్జా (పీడీపీ), ష‌మీ ఫిర్దౌజ్ (నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌), సుస్మితా దేవ్ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్‌సీపీ), కే.నారాయ‌ణ (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం), పూజ శుక్లా (ఎస్‌పీ), శ్యామ్ రాజ‌క్ (ఆర్ఎల్‌డీ), క‌పిల్ సిబ‌ల్‌, ప్ర‌శాంత్ భూష‌ణ్ స‌హా ప‌లు విప‌క్ష పార్టీల నేత‌లు, ప్ర‌తినిధులు పాల్గొన్నారు.