మొబైల్‌ ఫోన్లను చూపిస్తూ.. ఈడీ ఆఫీస్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

ఫోన్లు పగలగొట్టారంటూ ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు

mlc-kavitha-reaches-ed-office

న్యూఢిల్లీః బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవిషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కవిత ఈరోజు మరోసారి ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. భర్త వెంట రాగా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇక ఈడీ విచారణకు బయలుదేరేముందు కవిత పాత ఫోన్లను ప్రదర్శించారు. మొత్తం రెండు బ్యాగుల్లో ఉన్న ఫోన్లను చూపించిన ఆమె..మీడియాతో ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే కారులో వెళ్లిపోయారు.

ఈ కేసుకు సంబంధించి ఫోన్లు ధ్వంసం చేసినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు ముందు కవిత ఫోన్లను ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. దీంతో.. ఆమె ఈడీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ముందుకు సాగుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఈడీ ఆఫీసులోకి వెళ్లేముందు ఆమె తన భర్తను ఆలింగనం చేసుకున్నారు. ఇప్పటివరకూ ఈడీ అధికారులు కవితను రెండుమార్లు విచారించారు. ఆదివారం నాడు ఏకంగా పది గంటల పాటు విచారించారు. దీంతో.. ఈ రోజు ఏం జరగబోతోందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.