బెంగాల్ అసెంబ్లీలో ఘర్షణ.. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెండ్

కోల్‌కతా: ప‌శ్చిమ‌ బెంగాల్ లో అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే బీర్‌భూం ఘటనపై చర్చ జరగాలని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ , బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో ఇద్దరు ఎమ్మెల్యేలకు తీవ్రగాయాలయ్యాయి. టీఎంసీ ఎమ్మెల్యే అసిద్‌ మజుందార్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్‌ టిగ్గా చొక్కా చినిగిపోయింది. అసెంబ్లీలో భీర్‌భూమ్‌ ఘటనపై దర్యాప్తుకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సభలో గొడవ చేశారని స్పీకర్‌ బీజేపీ పక్ష నేత సువేందు అధికారితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. తమను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్‌ చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభ బయట ఆందోళన చేశారు.

కాగా, ఇటీవల బీర్‌భూం జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని వారు ప్రశించారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను తృణమూల్‌ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రెండు పార్టీల ఎమ్మెల్యేలపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/