మండుతున్న నిప్పులపై నడిచిన తెరాస ఎమ్మెల్యే

మహబూబాబాద్ తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్..తరుచు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈయన మండుతున్న నిప్పులపై నడిచి వార్తల్లో నిలిచారు. అయ్యప్ప స్వామి భక్తుడైన ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రతి ఏటా అయ్యప్ప మాల వేస్తుంటారు. గత 22 ఏళ్లుగా ఆయన అయ్యప్ప మాల ధరిస్తున్నారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప మాల వేశారు. దీక్షలో ఉన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్ అయ్యప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొన్నారు. మండుతున్న నిప్పులపై నుంచి నడుచుకుంటూ వెళ్లి తన భక్తిని చాటుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని.. భక్తి భావంతోనే మానసిక ప్రశాంతత కలుతుందని అన్నారు.

ఇక శంకర్ నాయక్ వ్యక్తిగత విషయానికి వస్తే.. మహబూబాబాద్‌ జిల్లా, రాయపర్తి మండలంలోని బాలాజీ తండా గ్రామంలో జన్మించాడు. 1985-1990 వరకు వరంగల్‌లోని ఆర్.ఈ.సి. ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ చదివాడు. 2009లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎంబిఏ పూర్తి చేసాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన శంకర్, రాజకీయాల్లోకి రాకముందు నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశాడు.ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిన శంకర్, ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. 2009లోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితపై 9,315 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్పై 13,534 ఓట్ల మెజారిటీతో రెండవసారి ఎన్నికయ్యారు.