నగరి ఎమ్మెల్యే టీచర్ గా మారి పాఠాలు బోధించింది

నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా టీచర్ గా మారింది. మన బడి నాడు – నేడులో భాగంగా రోజా చిత్తూరు జిల్లా నిండ్ర ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించడమే కాకుండా తొమ్మిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో “భూమి – మనం” అనే పాఠ్యాంశంను తీసుకొని పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత, పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను విద్యార్థులకు వివరించారు. ఆ తర్వాత ప్రశ్నలు వేసి పిల్లల నుంచి సమాధానాలు కూడా రాబట్టారు.

అలాగే శనివారం నగరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో రోజా పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సుందరీకరణ పనులను ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఆటోల ద్వారా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరణ, రోడ్లు, వీధుల్లో పరిసరాల పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.