మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను అరెస్ట్ చేసిన పోలీసులు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో రాజాసింగ్ పై నమోదైన రెండు కేసుల విషయంలో గురువారం ఉదయం మంగళహాట్, షాహినగర్ గంజ్ పోలీసులు 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆరు నెలల క్రితం నమోదైన కేసుల విషయంలో ఇప్పుడు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు అంటూ పోలీసులను రాజాసింగ్ నిలదీశారు. అయితే నిబంధనల మేరకే తాము నడుచుకుంటున్నామని, సహకరించాలని పోలీసులు రాజాసింగ్ ని కోరారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రాజా సింగ్ ని మరోసారి అరెస్టు చేశారు పోలీసులు.

ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజాసింగ్ నివాస ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ఆయన్ని ఇంటి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అనంతరం రాజాసింగ్‌ను న్యాయస్థానానికి తరలించనున్నట్లు సమాచారం. తన అరెస్టుకు కొద్దిసేపటి ముందు రాజాసింగ్ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తనను పాత కేసుల్లో అరెస్టు చేయాలని చూస్తున్నారని.. నగర బహిష్కరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు. వీడియో విడుదల చేసిన కాసేపటికే పోలీసులు రాజాసింగ్ ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.