రోడ్లు వేయాలని ప్రజలు కోరితే..వేయలేమని తేల్చి చెప్పిన వైస్సార్సీపీ ఎమ్మెల్యే

ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. మొదటి నుండి కూడా ప్రభుత్వాన్ని రోడ్లు వేయాలని ప్రజలు కోరుతూవస్తున్నారు. ఈ క్రమంలో గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్సీపీ ఎమ్మెల్యే ను ప్రజలు తమ గ్రామంలో రోడ్లు లేవని , రోడ్లు వేయాలని కోరగా..రోడ్లు వేయలేమని సదరు ఎమ్మెల్యే చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన కలిగిరి మండలం నాగసముద్రంలో జరిగింది.

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలం నాగసముద్రంలో పర్యటించారు. స్థానిక మహిళలు గ్రామంలో సీసీ రోడ్లు వేయాలని ఎమ్మెల్యేని కోరగా.. రోడ్లు వేయలేమని.. వేసిన రోడ్లకు బిల్లులు రాక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొత్త రోడ్లు వేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే సమాధానం తో సదరు స్థానికులు షాక్ లో పడ్డారు. ఆ తర్వాత చీమలవారిపాలెం ఎస్సీ కాలనీలో పర్యటిస్తుండగా.. స్థానికులు కూడా సిమెంటు రోడ్లు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఎక్కడైనా ఒక ఇల్లు కట్టించారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.