మూడు రాజధానుల వ్యవహారంపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో మూడు రాజధానులు కాదు.. మూడు రాష్ట్రాలు చేస్తే మంచిది..ఎమ్మెల్యే జగ్గారెడ్డి

mla-jagga-reddy-comments-on-jagan-and-sharmila

హైదరాబాద్ః ఏపిలో మూడు రాజధానుల వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల కంటే 3 రాష్ట్రాలు చేస్తే మేలని అన్నారు. అలా అయితే జగన్‌ కుటుంబంలో సీఎం పదవి కోసం ఉన్న గొడవ తీరుతుందని వ్యాఖ్యానించారు. మూడు రాష్ట్రాల్లో.. ఒకచోట జగన్‌, ఇంకోచోట షర్మిల, మరోచోట విజయసాయి సీఎం కావొచ్చని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. షర్మిల ఇంటి పంచాయితీని తెలంగాణలో పెట్టడం సరికాదని అన్నారు. అవసరమైతే ప్రధాని మోడీతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులపై షర్మిల చేస్తున్న ఆరోపణలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘ షర్మిలా నోరు అదుపులో పెట్టుకో..ఆడపిల్ల ఎలా మాట్లాడాలో’ అలా మాట్లాడు అని సూచించారు. మళ్లీ నోరు జారితే నీ గురించి చాలా విషయాలు చెప్తానని హెచ్చరించారు. వైఎస్సార్‌ గుణాలు షర్మిలకు ఏ మాత్రం లేవని అన్నారు.

అలాగే రాష్ట్రంలో వైద్యారోగ్య రంగంలో నెలకొన్న సమస్యలపై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య శ్రీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు వైద్య సేవలు అందేవి.. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పథకం అమలు సరిగ్గా లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు. క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వైద్యం చేయించుకున్నాక సీఎం సహాయనిధి నుంచి రూ.30 వేలే వస్తున్నాయని అన్నారు. ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలయ్యేలా కెసిఆర్‌, హరీశ్‌రావులు చూడాలని జగ్గారెడ్డి కోరారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యే మొత్తం పెంచాలన్నారు. రాష్ట్రంలో సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చినా కలవలేని పరిస్థితి నెలకొందన్న జగ్గారెడ్డి.. ఒకవేళ కలిసినా తప్పు పట్టే పరిస్థితులు వచ్చాయన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/