బతుకమ్మల మీదుగా తెరాస ఎమ్మెల్యే కారు..ఆగ్రహంతో ఊగిపోయిన మహిళలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఊరు , వాడ అనే తేడాలు లేకుండా ఆడపడుచులంతా బతుకమ్మ ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యే..కారు బతుకమ్మల మీదుగా దూసుకెళ్లడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది.

ఆత్మకూరుకు విచ్చేసిన చల్లా ధర్మారెడ్డి అక్కడ సెంట్రల్‌ లైటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో పోచమ్మ సెంటర్‌ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు కోరారు. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు తేల్చి చెప్పారు. అక్కడే ఉన్న సర్పంచ్‌ పర్వతగిరి రాజు ఓ పక్క నుంచి ఎమ్మెల్యే కారు పోనివ్వండిని ప్రాధేయపడ్డా పోలీసులు, అనుచరులు వినిపించుకోలేదు. బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కారును గ్రామస్థులు, మహిళలు అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.