దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మిషన్‌ భాగీరథ

minister-errabelli

హైదరాబాద్‌: ఈరోజు మిషన్‌భగీరధ ఈఎన్‌సీ కార్యాలయం వద్ద పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మిషన్‌ భాగీరథ ను 46వేల 123 కోట్ల అంచనాతో చేపట్టినట్టు తెలిపారు. ఇందులో 80శాతం నిధులను హడ్కో ,నాబార్డులతో పాటు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా సేకరించినట్టు తెలిపారు. ఇప్పటి వరకూ మిషన్‌ భాగీరథకు 33వేల 400 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు తెలిపారు. 38వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే మిషన్‌ భాగీరథ కోసం పరిపాలనా అనుమతి ఇచ్చిన మొత్తంలో 8వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 23వేల 787 ఆవాసాలకు తాగునీటిని అందిస్తున్నామన్నారు. మొత్తం 124 మున్సిపాలిటీలు, మున్సిపల్‌కార్పొరేషన్‌లకు కూడా భాగీరథ నీరు అందుతోందన్నారు. ఈ ప్రాజెక్టులకు 19వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి ప్రతిపాదించింది. ఇప్పటి వరకూ ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి కదలిక రాలేదన్నారు. ప్రాజెక్టులకు ఏటా 2వేల 110కోట్ల రూపాయలు అవసరమవుతాయని, కనీసం నిర్వహణా ఖర్చులనైనా ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. అయినా ఎలాంటి స్పందన లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్‌ భాగీరథ స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా జల్‌ జీవన్‌ మిషన్‌ పధకాన్ని రూపొందించిందన్నారు.


అయితే తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందని, రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తోందని దయాకర్‌రావు ఆరోపించారు. మిషన్‌ భాగీరథ పధకానికి కాపీగా కేంద్రం జలజీవన్‌ మిషన్‌ను అమలుచేస్తోందన్నారు. ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ర్టాలకు కేంద్ర నిధులు అందిస్తోందన్నారు.కానీ తెలంగాణ ప్రాజెక్టుల కోసం కేంద్రానికి సిఎం కెసిఆర్‌ ఎన్ని విజ్ఞప్తులుచేసినా పట్టించుకోవడం లేదన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/