జైలులాంటి విల్లాలో ప్రిన్సెస్‌ లతీఫా

దుబాయ్: దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూతురు షేక్ లతీఫా 2018లో దుబాయి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రిన్సెస్‌ లతీఫాకు సంబంధించిన ఒక వీడియో తాజాగా బయటికొచ్చింది. తాను జైలు లాంటి విల్లాలో ఉన్నానని, తన జీవితం ఆందోళనకరంగా ఉందని ఆమె అందులో చెప్పుకొచ్చారు. ‘నేను ఈ వీడియోను బాత్‌రూం నుంచి తీస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే నాకు లాక్ చేసుకునే అవకాశం ఉంది. నేను ఓ విల్లాలో ఉన్నాను. ఈ విల్లాను జైలుగా మార్చేశారు. అన్ని కిటికీలను మూసివేశారు. విల్లా బయట ఐదుగురు మగ పోలీసులు, లోపల ఇద్దరు మహిళా పోలీసులు ఉన్నారు. కనీసం బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చే స్వేచ్ఛ కూడా నాకు లేదు. నేను బంధీగా ఉన్నాను. నాకు స్వేచ్ఛ లేదు. నా జీవితం నా చేతుల్లో లేదు’ అంటూ లతీఫా సెల్ఫీ వీడియోలో తెలిపారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విదేశాలకు పారిపోయి అక్కడ స్వేచ్ఛగా బతకాలని 2018లో లతీఫా ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఓ స్నేహితురాలి సహాయంతో లతీఫా దుబాయి నుంచి ఓ షిప్‌లో తప్పించుకున్నారు. అయితే ఎనిమిది రోజుల తర్వాత ఆ షిప్‌ను అధికారులు గుర్తించి లతీఫాను తిరిగి దుబాయికి చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు లతీఫా గురించి ఒక్క వార్త కూడా బయటకు రాలేదు. ఇప్పుడు తాను ఓ విల్లాలో ఉన్నట్టు లతీఫా చెప్పారు. లతీఫా స్నేహితులే రహస్యంగా ఓ ఫోన్‌ను విల్లాలోకి పంపినట్టు తెలుస్తోంది. 


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/