మంత్రులు బొత్స, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరం – పువ్వాడ

పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని అలాగే ఏపీలో విలీనం అయిన అయిదు గ్రామాలను తెలంగాణ‌లో కలపాలని మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యల ఫై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ , అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు ఎలా తగ్గిస్తారు..విలీనమైన గ్రామాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంతే భద్రాచలం మాకు ఇస్తారా..హైదరాబాద్ ఏపీలో కలుపుతారా అంటూ వారు ప్రశ్నించారు. కాగా వీరి వ్యాఖ్యలఫై మంత్రి పువ్వాడ స్పందించారు.

మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమని పువ్వాడ​ అన్నారు. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదని సూచించారు. హైదరాబాద్‌ ఇస్తారా అని బొత్స అనటం.. అసందర్భం, అర్థరహితమని స్పష్టం చేశారు. నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదన్నారు. భ‌ద్రాచ‌లం ప్ర‌జ‌లు, ఆల‌యం నీట మున‌గ‌కుండా ఉండాల‌నేది త‌మ ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణానికి 5 గ్రామాల‌కు ఇవ్వాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు. విలీన గ్రామాల‌ను కేటాయించాల‌ని కోరితే.. హైద‌రాబాద్ ఇస్తారా అన‌టం.. అసంద‌ర్భం.. అర్థ‌ర‌హితం అని అజ‌య్ పేర్కొన్నారు.

భ‌ద్రాద్రి రాముడు నీటిలో మునిగితే ఏపీ ప్ర‌జ‌ల‌కైనా బాధే అని అన్నారు. కేసీఆర్‌తో జ‌గ‌న్ చ‌ర్చ‌ల‌కు బొత్స స‌త్యనారాయ‌ణ‌, అంబ‌టి రాంబాబు కృషి చేయాల‌ని సూచించారు. భ‌ద్రాచ‌లం రాముడు మున‌గ‌కుండా చూడాల‌న్నారు. జ‌గ‌న్‌తో చ‌ర్చించి 5 గ్రామాల‌ను ఇప్పించాల‌ని కోరారు.