మహాగణపతికి చివరి పూజలు చేసిన మంత్రి తలసాని

తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న మహాగణపతి..మరికొద్ది గంటలలో గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. ప్రస్తుతం మహాగణపతిని భారీ క్రేన్ సహాయంతో ట్రాలీపైకి ఎక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తులసాని మాట్లాడుతూ.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. మహాగణపతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని , ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా ఉత్సవాలు నిర్వహించామని.. శనివారం ఉదయం వరకు వినాయకుల నిమజ్జనం ముగుస్తుందని తెలిపారు.

67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. 50 అడుగుల ఎత్తు, 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సమేతంగా కొలువుదీరాడు. వాస్తవానికి ఉదయం 7 గంటలకే శోభాయాత్ర ప్రారంభించాలని అనుకున్నారు కానీ రాత్రి భారీ వర్షం పడడంతో శోభాయాత్ర ఆలస్యమైంది. సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్‌ మహాగణపతిని తరలించేందుకు ఈ ఏడాది అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరి ఖైరతాబాద్‌ గణేశుడిని ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నం.4 వద్దే నిమజ్జనం చేయనున్నారు. ఇక శోభాయాత్ర ఖైరాతాబాద్ సెన్షెన్‌ థియేటర్‌, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి మొత్తం 2.5 కిలోమీటర్లు సాగుతుంది. మధ్యాహ్నం 3 గంటలలోపే నిమజ్జనం పూర్తికానుంది.