లాక్డౌన్తో ప్రయోజనం ఉండదు
కేసీఆర్ కనపడకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయా?

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్ విధించే అంశం పై స్పందించారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో లాక్డౌన్ వల్ల లాభం ఉండదని చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్ను కట్టడి చేయొచ్చని తెలిపారు. కరోనా వచ్చి పోతుంటుందని, అందుకు తెలంగాణ మంత్రి మహమూద్ అలీతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. వారు కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. మరోవైపు విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కనపడకుండా పోయారని, ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని టీపీసీసీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై తలసాని మండిపడ్డారు. కేసీఆర్ కనపడకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయా? అని ప్రశ్నించారు. నిన్న వ్యవసాయ అధికారులతో కేసీఆర్ ఫోనులో మాట్లాడారని ఆయన తెలిపారు. బీజేపీ నేతలు కూడా కరోనాపై బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వారికి చేతనైతే ప్రధాని మోదీ మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలని సవాలు విసిరారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/andhra-pradesh/