ఈటల అహంకారానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం

కేసీఆర్ దయతో ఈటల ఆరు సార్లు గెలిచారు: తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్ : బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్‌పై మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఈట‌ల‌పై త‌ల‌సాని మండిప‌డ్డారు. గెల్లును కేసీఆర్ బానిస అని అనడం సరికాదని తలసాని అన్నారు. ఈటల అహంకారానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడ్డారు. ఈటల ముందు గెల్లు శ్రీనివాస్ చిన్నవాడే కావచ్చని… ఆనాడు దామోదర్ రెడ్డి ముందు ఈటల కూడా చిన్నవాడేనని తలసాని అన్నారు. ఈటల హుజూరాబాద్ లో బీసీ, శామీర్ పేటలో ఓసీ అని ఎద్దేవా చేశారు.

ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యతను ఇస్తుందని… గతంలో బాల్క సుమన్, కిశోర్ లకు అవకాశం కల్పించినట్టుగానే ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ కు కేసీఆర్ అవకాశం ఇచ్చారని తలసాని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి పట్టిన గతే ఇప్పుడు హుజూరాబాద్ లో ఈటలకు పడుతుందని అన్నారు. కేసీఆర్ దయతోనే ఈటల ఆరు సార్లు గెలిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇష్టానుసారం మాట్లాడటాన్ని బీజేపీ నేతలు మానుకోవాలని సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/