మ‌త్తు మ‌నిషిలోని నైపుణ్యాల‌ను చంపేస్తుంది : మంత్రి త‌ల‌సాని

డ్ర‌గ్స్ దుష్ప్ర‌భా‌వాల‌పై న‌గ‌ర పోలీసుల ర్యాలీ స్వ‌యంగా ప్ల‌కార్డు ప‌ట్టుకుని పాలుపంచుకున్న త‌ల‌సాని

హైదరాబాద్: మ‌త్తు ప‌దార్థాలు భాగ్య న‌గ‌రి హైద‌రాబాద్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. విదేశాల నుంచి గుట్టు చ‌ప్పుడు కాకుండా హైద‌రాబాద్ చేరుకున్న మాద‌క ద్ర‌వ్యాల‌ను న‌గ‌రంలోని ప‌లు రంగాల‌కు చెందిన సంప‌న్నుల పిల్ల‌లు విరివిగా వాడుతున్నారు. ఈ మ‌హ‌మ్మారిపై పోలీసులు ఎప్ప‌టిక‌ప్పుడు దాడులు చేస్తున్నా..స‌రికొత్త పెడ్ల‌ర్స్ మ‌త్తు మందుల‌ను హైద‌రాబాద్‌లో విచ్చ‌ల‌విడిగా విక్ర‌యిస్తున్నారు.

డ్ర‌గ్స్ వాడ‌కాన్ని స‌మూలంగా అరిక‌ట్టాల‌ని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసులు త‌మ వంతు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్ర‌జ‌ల‌కు డ్ర‌గ్స్ దుష్ప్ర‌భా‌వాల‌పై అవగాహ‌న క‌ల్పిస్తున్నారు. అంతేకాకుండా డ్ర‌గ్స్‌తో దొరికితే ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌స్తుందో తెలియ‌జేస్తున్నారు. ఇందులో భాగంగా, మ‌త్తులో మునిగితే చిత్తు కాక త‌ప్ప‌దు అన్న స్లోగ‌న్‌తో నేడు న‌గ‌రంలోని బేగంపేటలో ఓ అవ‌గాహ‌న ర్యాలీని నిర్వ‌హించారు. హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్‌, డీసీపీ చంద‌నా దీప్తి త‌దిత‌రులు పాలుపంచుకున్న ఈ ర్యాలీలో తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాదవ్ కూడా పాల్గొన్నారు. మ‌త్తు ప‌దార్థాలు మ‌నిషిలోని నైపుణ్యాల‌ను దెబ్బ తీస్తాయ‌న్న ప్ల‌కార్డు ప‌ట్టుకుని మంత్రి ర్యాలీకి ముందు న‌డిచారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/