లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు చూపించి తీరుతాం

talasani srinivasa yadav
talasani srinivasa yadav

హైదరాబాద్‌: ల‌క్ష డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు చూపించే వ‌ర‌కు భ‌ట్టి విక్ర‌మార్క వెంబ‌డి తిరిగి చూపిస్తాన‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని జియ‌గూడ‌, గోడికేక‌బీర్, ఇందిరాగాంధీ కాల‌నీ, బ‌న్సీలాల్‌పేట, క‌ట్టెల‌మండిలో నిర్మించిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను భ‌ట్టి విక్ర‌మార్క‌కు మంత్రి త‌ల‌సాని, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ క‌లిసి చూపించారు. అనంత‌రం మంత్రి త‌ల‌సాని మీడియాతో మాట్లాడుతూ.. పేద వ‌ర్గాలు గొప్ప‌గా బ‌త‌కాల‌నే ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్‌ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌ని తెలిపారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కే కేటాయిస్తున్నామ‌ని చెప్పారు. ఈ ఇండ్ల‌ను సిఎం కెసిఆరే డిజైన్ చేశార‌ని గుర్తు చేశారు.

హైద‌రాబాద్‌లో మొత్తం 60 ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ఇవాళ చూసింది చాలా త‌క్కువ అని తెలిపారు. భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఎన్నడూ లేని విధంగా రాష్ర్ట ప్ర‌భుత్వం డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. ఒక్కో ఇంటి విలువ రూ. కోటి వ‌ర‌కు ఉంటుంద‌న్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. ల‌క్ష ఇండ్ల నిర్మాణాల కోసం ప్ర‌భుత్వం రూ. 10 వేల కోట్లు ఖ‌ర్చు పెడుతుంద‌న్నారు. కొల్లూరులో 15 వేల ఇండ్లు నిర్మించాం. అవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వీలైనంత త్వ‌ర‌గా ఈ ఇండ్ల‌ను పూర్తి చేసి పేద‌వారికి పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం ముందుకెళ్తుంది. ల‌బ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/