ములుగు జిల్లాలోని అగ్నిప్రమాద ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి

గురువారం సాయంత్రం ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈదురుగాలుల‌కు మంట‌లు వ్యాపించి ఓ ఊరును బూడిద చేసాయి. మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగ కుంటలో ఈదురుగాలుల వ‌ల్ల అట‌వీప్రాంతంనుంచి మంట‌లు గ్రామానికి వ్యాపించాయి. దీంతో గ్రామంలోని 40 ఇళ్లు కాలిబూడిద‌య్యాయి. దీంతో గిరిజనులు రోడ్డున పడ్డారు. అగ్ని ప్రమాదం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు ట్రై చేసారు. కానీ గుడిసెలు కావడం మంటలు త్వరగా అంటుకున్నాయి. అలాగే విద్యుత్ సిబ్బంది సైతం ఈ విషయం తెలిసి వెంటనే విద్యుత్ ను నిలిపివేశారు.

కాగా ఈ ఘటన పట్ల రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ల తో మాట్లాడిన సత్యవతి రాథోడ్ బాధితులకు అవసరమైన సహాయాన్ని తక్షణం అందించాలని వెల్లడించారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించిన సత్యవతి రాథోడ్, బాధితుల కుటుంబాలకు అండగా తాము ఉంటామంటూ పేర్కొన్నారు.