కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు తెరుస్తాం

విద్యా సంస్థ‌లు తెరిచేందుకు మ‌రింత స‌మ‌యం..మంత్రి సబిత

minister-sabitha-indra reddy

హైదరాబాద్‌: శాసనమండలిలో పాఠ‌శాల‌ల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మాధానం ఇచ్చారు కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మార్చి 16 నుంచి పాఠ‌శాల‌ల‌ను మూసివేయ‌డం జ‌రిగింది అని ఆమె తెలిపారు. విద్యా సంస్థ‌లు తెరిచేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు పాఠ‌శాల‌లు తెరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. విద్యా సంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా ఉండేందుకు ఆన్‌లైన్ క్లాసులకు రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. విద్యార్థులంద‌రికీ ఉచితంగా బుక్స్‌ను పంపిణీ చేశామ‌ని తెలిపారు.

విద్యాశాఖ త‌ర‌పున మూడు ర‌కాల స‌ర్వే చేశామ‌ని చెప్పారు. రాష్ర్టంలో 85 శాతం మంది విద్యార్థుల నివాసాల్లో టీవీ ఉంద‌ని స‌ర్వేలో తేలింద‌న్నారు. స‌ర్వే ప్ర‌కారం 40 శాతం విద్యార్థుల ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయ‌న్నారు. టీవీ, స్మార్ట్ ఫోన్లు లేని వారిని ప‌క్క‌వారితో అనుసంధానం చేశామ‌ని తెలిపారు. దూర‌ద‌ర్శ‌న్‌, టీ శాట్ యాప్‌లో డిజిట‌ల్ క్లాసులు అందుబాటులో ఉంచామ‌న్నారు. విద్యార్థుల ఫీడ్ బ్యాక్ కోసం వ‌ర్క్ షీట్స్ త‌యారు చేశామ‌ని చెప్పారు. విద్యార్థులంద‌రూ ఆన్‌లైన్ క్లాసులు వింటున్నార‌ని మంత్రి తెలిపారు. 48 వేల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ బోధ‌న‌ను అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/