దుర్గమ్మ సేవలో మంత్రి రోజా

ఏపీ పర్యాటక, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా శరన్నవ రాత్రుల ఏర్పాట్లను పర్యవేక్షించిన రోజా.. సహచర మంత్రులతో కలిసి దుర్గమ్మ ఆలయ పరిసరాలను పరిశీలించారు. అలాగే దుర్గా మాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గా మాతకు రోజా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఇక శరన్నవరాత్రులు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్ ను ఆలయ నిర్వాహకులు ఖరారు చేశారు. పది రోజుల పాటు అమ్మవారికి అలంకారాలు, కట్టే చీర రంగు, నైవేద్యం తదితర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. తొలిరోజు సోమవారం 26న స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా, 27న లేత గులాబీ రంగు చీర ధరించి బాలాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారని వెల్లడించారు.

28న శ్రీ గాయత్రీ దేవిగా, 29న శ్రీ అన్నపూర్ణ దేవిగా, 30న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గా, అక్టోబర్‌ 1న శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో దర్శనమిస్తారని వెల్లడించారు. 2న శ్రీ సరస్వతి దేవిగా 3న శ్రీ దుర్గా దేవిగా 4న శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా, 5న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు కనువిందు చేయనున్నారని వివరించారు.