చంద్రబాబుకు.. మంత్రి విడదల రజిని సవాల్

టీడీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు చంద్రబాబుకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సవాల్ విసిరారు. ప్రస్తుతం వైస్సార్సీపీ మంత్రులు ‘సామాజిక న్యాయభేరి’ పేరిట బస్సుయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో మంత్రులు ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజలకు చేరవేస్తూ ..టీడీపీ, జనసేన పార్టీల ఫై నిప్పులు చెరుగుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ దృఢ సంకల్పంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల చిరకాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని, 70 శాతం మంత్రి పదవులను ఆయా వర్గాలకే ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ మహానాడు దూషణలే లక్ష్యంగా ఏడుపునాడుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలో చంద్రబాబుకు సవాల్ విసిరారు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని. టీడీపీకి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని ఆమె ప్రశ్నించారు. మీ ఓట్లు నాకు వేయండి.. మీ తలరాతను మారుస్తానని జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారని చెప్పారు. జనసేన, బిజెపి సపోర్టు లేకుండా 2024లో చంద్రబాబు బరిలో దిగగలరా? అని అడిగారు. వైసీపీ ని ప్రజలు ఓడించాలని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు అని, అసలు ప్రజలు జగన్ ని ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు.