కెసిఆర్‌ వ్యాఖ్యలతో మా ప్రభుత్వంలో పట్టుదల పెరిగింది

Perni Nani
Perni Nani


అమరావతి: ఏపిలో ఆర్టీసీ విలీనంపై ఓ ప్రయోగం చేశారని, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని స్పందించారు. విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో టీడీపీ ఎంపీ కేశినేని నాని నిర్మించిన వసతి భవనాన్ని పేర్ని నాని ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, దేశంలో చాలా వ్యవస్థలు ప్రైవేటు పరం అవుతున్న పరిస్థితుల్లో ఏపీలో మాత్రం ఒక కార్పొరేషన్ ను సర్కారులో విలీనం చేయడమనేది గొప్ప విషయమని పేర్ని నాని అన్నారు. తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మెపై ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో ఏం జరుగుతుందో ఆరు నెలల్లో చూద్దామని అన్నారని, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో కసి పెరిగిందని తెలిపారు. జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని ప్రకటన చేశామని, దాన్ని అమలు చేసి తీరాలన్న పట్టుదల పెరిగిందని పేర్ని నాని అన్నారు. కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యను తాము పాజిటివ్ గా తీసుకున్నామని చెప్పారు. కొన్ని నెలల్లో ఇచ్చిన మాటను నెరవేర్చుతామన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/