మద్యం ఫొటోస్ ఫై మంత్రి మల్లారెడ్డి క్లారిటీ

టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి మద్యం ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చ గా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఈ ఉప ఎన్నిక కు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైంది. దీంతో అన్ని పార్టీల నేతలు మునుగోడు లో ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత అన్న చందంగా విందు, మందు రాజకీయం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటె మునుగోడు ఉప ఎన్నికకు చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామం ఇన్చార్జిగా మంత్రి మల్లారెడ్డి నియమితులయ్యారు. అయితే అందరిలా కాకుండా మల్లారెడ్డి, ఓటర్లను ఆకట్టుకోవడానికి తనదైన శైలిలో పని మొదలుపెట్టారు. ఇప్పటికే మందు, విందులతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపణలు వస్తున్న వేళ చౌటుప్పల్ సమీపంలోని ఒక హోటల్ ను బుక్ చేసుకున్న మల్లారెడ్డి.. మందు బాటిల్ పట్టుకొని కొంతమందికి మందు పోస్తున్నట్లు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి మల్లారెడ్డి ఫుల్ లిక్కర్ బాటిల్ పట్టుకొని తనతో కలిసి కూర్చున్న వారందరికీ మందు పోస్తున్నట్లు కనిపిస్తుండడంతో ప్రతిపక్షపార్టీలు ఈ ఫోటో ను షేర్ చేస్తూ టిఆర్ఎస్ ఫై ఆరోపణలు చేస్తున్నారు.

ఈ తరుణంలో మంత్రి మల్లారెడ్డి మద్యం ఫొటోస్ ఫై క్లారిటీ ఇచ్చారు. ఆ ఫొటోలలో ఉన్నది తానేనని, మద్యం తాగితే తప్పేంటని ప్రశ్నించారు. మునుగోడులో ప్రచారం ముగిసిన అనంతరం బంధువుల ఇంట్లో మద్యం తాగితే తప్పా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలను నిలదీశారు. ప్రత్యర్థి పార్టీలు కావాలనే తన ఫొటోలను వైరల్ చేస్తూ అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, ఇందులో తనకు తప్పేమీ కనబడటం లేదంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామంటూ బీజేపీ చెబుతోందని, అవసరమైతే దీనిపై సీబీఐ విచారణకైనా సిద్దమంటూ సెటైర్లు పేల్చారు. తానంటే గిట్టని వాళ్లు ఈ పని చేస్తున్నారని, ఇందులో బీజేపీ కుట్ర దాగి ఉందంటూ విమర్శించారు.