ఏపీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం తరహాలోనే పోలవరం పూర్తి – మంత్రి మల్లారెడ్డి కామెంట్స్

ఏపీలో కూడా బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం తరహాలోనే పోలవరం పూర్తి చేస్తామన్నారు మంత్రి మల్లారెడ్డి . ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తో పాటు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారు జామున వైకుంఠ ద్వారం గుండా మంత్రి మల్ల రెడ్డి తో పాటు మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ , శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో పాటు పలువురు ప్రముఖులు వేర్వేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి, పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ కు దేశ వ్యాప్తంగా ఆదరణ వస్తుందని , తెలంగాణ లో కేవలం ఎనిమిదేళ్లలో అభివృద్ధి చేసిన కేసీఆర్‌.. అన్ని రాష్ట్రాలకు మోడల్‌గా తీర్చిదిద్దారన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారన్నారు. 2024 ఎన్నికల్లో దేశంలో విజయం సాధించి కేసీఆర్ ప్రధానిగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, ఏపీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాగైతే పూర్తి చేశారో.. అదే తరహాలో పోలవరాన్ని పూర్తి చేసి, ఆంధ్రా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి చేస్తారన్నారు.