కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి ఫై శాఖ మంత్రి మల్లారెడ్డి ఫైర్..

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడిపై కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. ఈడీ నోటీసులు వస్తే ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలి కానీ.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందని ఎద్దేవా చేశారు. విధుల్లో ఉన్న ఎస్ఐ కాలర్ ఎలా పట్టుకుంటారు అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇబ్బంది కలిగిస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. ఇక దేశంలో కాంగ్రెస్ రెండే రాష్ట్రాల్లో అధికారంలో ఉందని.. బీజేపీ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతుంది అన్నారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు ఇద్దరు ఐరన్ లెగ్ లని అభివర్ణించారు. వాళ్ళిద్దరూ ఎక్కడ అడుగుపెడితే అక్కడ వర్షాలు ఉండవని ఎద్దేవా చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి విషయానికి వస్తే.. రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ జరపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. రోడ్డు ఫై ఓ ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టి తగలబెట్టారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతేగాక, బస్సుపైకి ఎక్కి నినాదాలు చేశారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం , వారిపై లాఠీ ఛార్జి చేయడం చేశారు. భట్టి , రేణుక చౌదరి లు పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాదు వారి చొక్కాలను పట్టుకొని లాగారు. ప్రస్తుతం పోలీసులు కాంగ్రెస్ నేతల ఫై పలు శిక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.