పేపర్‌ లీకేజీ వ్యవహారం.. దీని వెనక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి కెటిఆర్‌

నాలుగు పరీక్షలకు తిరిగి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడి

Minister KTR’s media conference at BRK Bhavan

హైదరాబాద్‌: పేపర్‌ లీకేజీ వ్యవహారంపై మంత్రి కెటిఆర్‌ బీఆర్కే భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ 155 నోటిఫికేషన్లు ఇచ్చిందని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. ఏకకాలంలో 10లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్‌పీఎస్సీది అని అన్నారు. గత 8ఏళ్లలో భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసిందన్నారు. ‘‘ఉమ్మడి ఏపీలో ఏపీపీఎస్సీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ మీద ఒక్క ఆరోపణ కూడా రాలేదు. కానీ, దురదృష్టవశాత్తు ఆ కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చింది. ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి మాత్రమే కాదు.. దీని వెనక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని కెటిఆర్‌ తెలిపారు.

సిట్ ప్రాధమిక దర్యాప్తు మేరకు ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే అన్నారు. వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందని, హ్యాకింగ్ జరగలేదని స్పష్టం చేశారు. కానీ, కొంతమంది విద్యార్థులు, యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వారి వలలో పడవద్దని యువతకు కెటిఆర్ సూచించారు. ఈ కేసులో అరెస్టయిన రాజశేఖర్ రెడ్డి బిజెపి క్రియాశీల కార్యకర్త అన్నారు. లీకేజే వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్నది తేల్చాలని డీజీపీకి బీఆర్ఎస్ పార్టీ పరంగా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.

గ్రూప్1 సహా రద్దయిన నాలుగు పరీక్షలకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ ఆన్ లైన్ లో ఉచితంగా అందుబాటులో పెడతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సెంటర్లను బలోపేతం చేస్తామన్నారు. రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసి అవి 24 గంటలు నడిచేలా చేస్తామన్నారు. స్టడీ సెంటర్లలో ఉచితంగా భోజనం కూడా అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.