నేడు వరంగల్‌లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. గ్రేటర్‌ వరంగల్‌లో అంతర్భాగంగా ఉన్న వర్ధన్నపేట, వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, పరకాల నియోజకవర్గాలతో పాటు నర్సంపేటలోనూ కేటీఆర్‌ పర్యటిస్తారు. ఈ సందర్భంగా అనేక పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం హెలికాప్టర్‌ ద్వారా హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాలకు చేరుకుంటారు. తొలుత ఎంజీఎంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మంత్రి వరుసగా ఐదు నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం మూడు గంటలకు హన్మకొండ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో రివ్యూమీటింగ్‌ ఉంటుంది. అనంతరం 4.30 గంటలకు హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో నిర్వహించనున్న హన్మకొండ, వరంగల్‌ జిల్లాల పార్టీల ప్రతినిధుల సభలో కేటీఆర్‌ పాల్గొంటారు. ఈ సభలో 15 వేల మంది పాల్గొననున్నారు. సాయంత్రం 6గంటల10 నిముషాలకు హెలికాప్టర్‌ ద్వారా తిరిగి హైదరాబాద్‌ వెళ్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ఆరూరి రమేష్‌, హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయభాస్కర్‌ తదితరులు మంగళవారం హన్మకొండలో విలేకరులకు వెల్లడించారు.

కాగా, అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి రాజకీయం రాజుకుంటున్న ఓరుగల్లులో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. వరంగల్‌, హన్మకొండ జిల్లాలో బుధవారం కేటీఆర్‌ పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న అనంతరం హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్‌లో జరగనున్న ప్రతినిధుల సభలో శ్రేణులకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్‌ పర్యటనను పురస్కరించుకుని వరంగల్‌ నగరాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు గులాబీ రంగు ఫ్లెక్సీలతో నింపివేయడం విశేషం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/