సంక్షోభంలోనూ రైతులకు రుణమాఫీ చేశాం..కెటిఆర్‌

సిరిసిల్ల జిల్లాలోముస్తాబాద్‌లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన

minister-ktr

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కెటిఆర్‌, నిరంజన్‌ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా ముస్తాబాద్‌లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. రాచర్ల గొల్లపల్లిలో వ్యవసాయ గోదాంకు శంకుస్థాపన చేశారు. రాచర్ల బొప్పాపూర్‌లో మార్కెట్‌ కమిటీ పరిపాలన భవనాన్ని ప్రారంభించారు. రైతు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా రాచర్ల బొప్పాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ.. ప్రపంచమంతా కరోనాతో గందరగోళంలో ఉంది. అమెరికా మొదలుకుని భారతదేశం వరకు తల్లడిల్లుతుంది. అన్ని దేశాలకు ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్ర ఆదాయం 95 శాతం తగ్గింది. ఇంత సంక్షోభంలోనూ రైతులకు రూ. 1,200 కోట్ల రుణమాఫీ చేశామని మంత్రి కెటిఆర్‌‌ తెలిపారు.రాష్ట్రంలో తెలంగాణ రైతులు అనేక కష్టాలు పడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం ఎట్లా ఉందో రైతులందరికీ తెలుసు అని కెటిఆర్‌‌ అన్నారు.

ఇవాళ రైతులకు పెట్టుబడికి, విత్తనాలకు, ఎరువులకు, నీళ్లకు కరెంట్‌కు కొదవ లేదు.  సిఎం కెసిఆర్ ‌ కృషితో ఎండకాలంలోనూ చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయి. రైతులు నిర్భయంగా సేద్యం చేసుకునేందుకు అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. ఎరువులు, విత్తనాలు అందించేందుకు సిఎం ఆర్థిక చేయూత అందించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. వానాకాలం సాగు కోసం నిధులు అందజేశాం. ఎరువులు, విత్తనాలు ముందస్తుగా తీసుకొచ్చి రైతులు వరుసల్లో నిలబడకుండా చేశామన్నారు. సిరిసిల్ల జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా నీరు అందిస్తాం. దసరా వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం అని కెటిఆర్‌ తెలిపారు.


తాజా అంతర్జాతీ వార్తల క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/