డబుల్‌ డెక్కర్‌ బస్సులపై స్పందించిన కెటిఆర్‌

డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ తీసుకురావాలని నెటిజన్ ట్వీట్

TS Minister KTR-
TS Minister KTR-

హైదరాబాద్‌: భాగ్యనగంలో ఒకప్పుడు డబుల్‌ డక్కెర్‌ బస్సులు ఉండేవి. నిజాం కాలం‌లో ప్రారంభ‌మైన డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు కాల‌క్ర‌మేణా క‌నుమరుగై పోయాయి. అయితే షాకీర్ హుస్సేన్ అనే యువ‌కుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను గుర్తు చేస్తూ తెలంగాణ మంత్రి కెటిఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఒక‌ప్పుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబ‌ర్‌తో న‌డిచేవి. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జ‌ల్‌గంజ్‌, అబిడ్స్‌, హుస్సేన్ సాగ‌ర్‌, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకునేవి డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు. హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులను ప్ర‌యాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాల‌ని షాకీర్ హుస్సేన్ కెటిఆర్‌ ‌ను కోరారు.

ఈ ట్వీట్‌పై కెటిఆర్‌ స్పందించారు. అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామ‌ర్ స్కూల్లో తాను చ‌దువుకున్న‌ప్పుడు.. దారిగుండా వెళ్తున్న‌ప్పుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు క‌నిపించేవి. డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల గురించి చాలా జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని కెటిఆర్‌ పేర్కొన్నారు. ఆ బ‌స్సుల‌ను ఎందుకు ఆపేశారో త‌న‌కు క‌చ్చితంగా తెలియ‌ద‌న్నారు. డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను మ‌ళ్లీ రోడ్ల‌పైకి తీసుకువ‌చ్చేందుకు ఏమైనా అవ‌కాశం ఉందా? అంటూ ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌ను కెటిఆర్‌ అడిగారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/