నూత‌న జోన‌ల్ వ్య‌వ‌స్థ… సీఎం కేసీఆర్‌కు కేటీఆర్ ధ‌న్య‌వాదాలు

తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థ
ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధికం స్థానికులకే వస్తాయన్న కేటీఆర్

హైదరాబాద్ : తమ ప్రభుత్వం నూతనంగా జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ ద్వారా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగాలు, విద్యాపరమైన అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని పేర్కొన్నారు. ఈ జోనల్ వ్యవస్థ ఏర్పాటు కోసం సుదీర్ఘ కసరత్తు చేసి, గొప్ప దార్శనికతతో వ్యవహరించారంటూ సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించి అమల్లోకి తీసుకువచ్చారంటూ కితాబునిచ్చారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేసిందని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ జోన్ల ఏర్పాటు వల్ల దేశంలో మరెక్కడా లేని రీతిలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధికం స్థానికులకే దక్కుతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్షల మేరకు పాలన ప్రయోజనాలను ప్రజలకు వేగంగా తీసుకువెళ్లేందుకు జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేశామ‌ని కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు ఆయా జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించామ‌న్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణ్ పేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చి చట్టబద్ధం చేయడంతో పాటు, వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవడం పట్ల ఆయా జిల్లాల ప్రజల తరఫున ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని మించి వివిధ శాఖల ద్వారా 1,33,000 చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకి అందించామ‌ని కేటీఆర్ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/