సిరిసిల్ల‌లో కుండపోత వర్షం.. కేటీఆర్ టెలీకాన్ఫ‌రెన్స్

సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, ప్రాంతాలు నీటమునిగాయి. కుండపోత వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద పోటెత్తింది. పట్టణం నిండు చెరువును తలపించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరదనీరు పలు కాలనీల్లోకి వచ్చి చేరుతోందని… సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వరద ముంపున‌కు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు. సహాయక చర్యల కోసం హైద‌రాబాద్‌ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని తెలిపారు. ప్రజలెవ‌రూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రంగం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/