ఈ ఏడాది అన్ని ఉద్యోగాల భర్తీ ఉంటుంది : : మంత్రి కేటీఆర్

మున్సిపల్ శాఖ వార్షిక నివేదిక విడుదల..అన్ని పట్టణాల్లో 10 అంశాలతో కూడిన అజెండా అమలు

minister-ktr-releases-municipal-annual-report

హైదరాబాద్ : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 2021-22 సంవత్సరానికి గాను పురపాలక శాఖ వార్షిక నివేదికను నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరు అడగకున్నా ప్రతి ఏడాది ప్రగతి నివేదిక విడుదల చేస్తున్నామని తెలిపారు. అద్భుతంగా పనిచేస్తున్న మున్సిపల్‌, పట్టణాభివృద్ధి అధికారులను అభినందించారు. కరోనా కాలంలో మున్సిపల్‌ సిబ్బంది బాగా పనిచేశారని, కరోనా టీకాలు వేయడంలో మున్సిపల్‌ సిబ్బంది పాత్ర మరచిపోలేమని మంత్రి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇండియాలో టాప్‌ 10 నగరాలు తెలంగాణ నుంచే ఉన్నాయని చెప్పారు. పేదలకు ఆత్మగౌరవ గృహనిర్మాణం చేస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో వ్యర్ధ పదార్థాలతో 62 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. అన్ని మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధీకరణ చేస్తున్నామన్నారు. రూ.100 కోట్లతో అవుటర్‌ రింగ్‌రోడ్డు మొత్తం ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సోలార్‌ రూఫ్‌టాప్‌తో 21 కిలోమీటర్ల సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం కింద రూ.వెయ్యి కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈసారి వరద ముప్పు ఉండదని తాను చెప్పనని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

ఈ ఏడాది అన్ని ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. 50 వేల జనాభా కలిగివున్న ప్రతి మున్సిపాలిటీలో త్వరలోనే వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పోస్టు ఉంటుందన్నారు. రాష్ట్రంలో 141 మున్సిపాలిటీల పరిధిలో రూ.3,700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని కేటీఆర్ వివరించారు. అంతేకాదు, అన్ని పట్టణాల్లోనూ 10 అంశాలతో కూడిన ప్రత్యేక అజెండా అమలుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇక, రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే రెండోస్థానంలో ఉందని తెలిపారు. నగరంలో ఇళ్ల అమ్మకాల్లో 142 శాతం వృద్ధి నమోదైందని వివరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/