టాప్ ఫార్మా కంపెనీల అధిప‌తుల‌తో మంత్రి కేటీఆర్ భేటీ

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ అమెరికాలో ప్ర‌పంచంలోనే టాప్ ఫార్మా కంపెనీలైన‌ ఫైజ‌ర్‌, జాన్స‌న్ అండ్ జాన్స‌న్ (జేఅండ్‌జే), జీఎస్‌కే అధిప‌తుల‌తో శ‌నివారం స‌మావేశ‌మ‌య్యారు. మొద‌ట ఫైజ‌ర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్, చైర్మ‌న్ డాక్ట‌ర్ ఆల్బ‌ర్ట్ బౌర్లా, కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ గ్లోబ‌ల్ స‌ప్లై ఆఫీస‌ర్ మైక్ మెక్‌డెర్మాట్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. తెలంగాణ‌లో లైఫ్ సైన్సెస్‌రంగం పురోగ‌తిని వివ‌రించారు. అలాగే, ఇండియాలో హెల్త్‌కేర్‌, ఫార్యాస్యూటిక‌ల్ రంగానికి సంబంధించి ఫైజ‌ర్ కంపెనీ వ్యూహాలు, ప్ర‌ణాళిక‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం ఫైజ‌ర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ఉవే స్కోన్‌బెక్‌తో కూడా స‌మావేశ‌మ‌య్యారు. రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ రంగంలో హైదరాబాద్ ఎకోసిస్టంను తెలియ‌జేసేందుకు మంత్రి కేటీఆర్, జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్ట‌ర్ మ‌థాయ్ మామెన్‌తో స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం మ‌రో అతిపెద్ద ఫార్మా కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ఆగం ఉపాధ్యాయ్‌తో స‌మావేశ‌మ‌య్యారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ సామర్థ్యాలను వివ‌రించారు. మంత్రి వారితో లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన తన విజన్‌ని పంచుకున్నారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడంలో సహాయపడే సాధ్యమైన మార్గాలు, కార్యక్రమాలపై సూచనలను కోరారు.

ఫిబ్రవరి 2023లో హైదరాబాద్‌లో జరగనున్న 20వ బయో ఏషియా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించారు. కాగా, మంత్రి కేటీఆర్‌ ప్రజెంటేషన్‌తోపాటు ఇన్నోవేష‌న్‌పై దృష్టి సారించి లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫార్మా కంపెనీల అధిప‌తులు మెచ్చుకున్నారు. ఈ స‌మావేశాల్లో మంత్రి కేటీఆర్‌తోపాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శ్రీ శక్తి ఎం. నాగప్పన్ పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/