భారత్ బంద్ నేపథ్యంలో రైతులకు కెటిఆర్ సంఘీభావం
షాద్‌నగర్ బూర్గుల గేట్ వద్ద నిరసన

హైదరాబాద్: ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్ నిరసనల్లో తెలంగాణ మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. షాద్‌నగర్ బూర్గుల గేట్ వద్ద రైతులు నిర్వహించిన రాస్తారోకోకు, భారత్ బంద్‌కు మద్దతుగా టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కెటిఆర్ పాల్గొన్నారు.
‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది’ అని కెటిఆర్ అన్నారు. ‘నూతన వ్యవసాయ చట్టం ద్వారా బ్లాక్ మార్కెట్‌ను నిరోధించడానికి ఏర్పాటు చేసిన నిత్యావసరాల నిల్వల చట్టాన్ని సవరించారు. వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముకునే ప్రమాదం ఉంది. ఇది రైతులకు, వినియోగదారుడికి ఇద్దరికీ నష్టమే’అని కెటిఆర్ తెలిపారు. ‘దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం నేడు అన్ని రాష్ట్రాల రైతులు కదులుతున్నారు. గత ఆరేళ్లుగా రైతు బంధుగా ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రైతన్నల దేశవ్యాప్త ఆందోళనకు పూర్తి మద్దతు పలుకుతోంది’ అని కెటిఆర్ తెలిపారు.
మరోవైపు, కామారెడ్డి జిల్లా టెక్రియల్ చౌరస్తా వద్ద నిర్వహించిన రైతుల ధర్నాలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో పాటు టిఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు కవిత సంఘీభావం తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వారికి పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బ్లాక్ బెలూన్స్‌ను గాల్లోకి వదిలారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/