కేసీఆర్ ను రైతు వ్యతిరేకి అనడం శతాబ్దపు జోక్ – కేటీఆర్

minister-ktr

మునుగోడు బిజెపి సభ లో అమిత్ షా మాట్లాడుతూ..రైతు వ్యతిరేకి కేసీఆర్ అని అనడం పట్ల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ ను రైతు వ్యతిరేకి అనడం శతాబ్దపు జోక్ అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును కాపీ చేసి.. పీఎం కిసాన్ గా మార్చిందేవరో చెప్పాలని కేటీఆర్..అమిత్ షా ను బిజెపి నేతలను ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసారు.

ఫసల్ బీమా యోజనలో చేరలేదని కేసీఆర్ ను విమర్శిస్తున్న అమిత్ షా.. గుజరాత్ ప్రభుత్వం అదే పథకాన్ని ఎందుకు తిరస్కరించిందో చెప్పాలన్నారు . అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ రైతాంగానికి ప్రయోజనం చేకూర్చని ఫసల్ బీమా యోజన.. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొని … క్షమాపణ చెప్పిన వారెవరని కేటీఆర్ ప్రశ్నించారు.

అలాగే అమిత్‌షా కోసం చెప్పులు తేవడానికి బండి సంజయ్‌ వెళ్లారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు అందించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో దుమారం రెగుతోంది. దీంతో బండి సంజయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గుజరాత్ నేతల కాళ్ళ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారంటూ టీఆర్ఎస్ పోస్టులు పెట్టింది. దీనిపైన మంత్రి కేటీఆర్ స్పందించారు . ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.